రాష్ట్ర సచివాలయం, అమరావతి,
వైద్యానికి డబ్బు కొరత అడ్డంకి కాకూడదు.. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం – మంత్రి సత్యకుమార్ యాదవ్
సర్వైకల్ మైలోపతి బాధితుడికి రూ.1,21,427 సీఎంఆర్‌ఎఫ్ ఎల్ఓసి – వెంకట్ దీక్షిత్ కుటుంబానికి మంత్రి చేతుల మీదుగా అందజేత
వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యుల వినతి.. వెంటనే స్పందించి SVIMSలో చికిత్సకు మార్గం సుగమం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద కుటుంబాల్లో ఎవరి వైద్య చికిత్సకు ఆటంకం కలగకూడదని, అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలవడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై వెంటనే స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అర్హులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధర్మవరం పట్టణంలోని యాదవ వీధికి చెందిన వల్లంసెట్టి వెంకట్ దీక్షిత్ కొంతకాలంగా సర్వైకల్ మైలోపతి (Cervical Myelopathy) వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి కారణంగా అవసరమైన వైద్య చికిత్స పొందాల్సి ఉండగా, చికిత్సకు అయ్యే ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత లేక ఆయన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వెంకట్ దీక్షిత్ కుటుంబ సభ్యులు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని, వైద్య చికిత్స అవసరాన్ని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఆవేదనను, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి గారు వెంటనే స్పందించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. వెంకట్ దీక్షిత్‌కు అవసరమైన చికిత్స అందించేందుకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) లో వైద్యం పొందేలా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా లేఖ రాశారు. మంత్రి చొరవతో సీఎంఆర్‌ఎఫ్ పరిధిలో రూ.1,21,427 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరైంది. మంజూరైన ఈ సీఎంఆర్‌ఎఫ్ ఎల్ఓసిని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా వెంకట్ దీక్షిత్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, వైద్యం పొందాల్సిన సమయంలో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలి. ధర్మవరం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే, సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తాను అని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్స కోసం కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అందించే సహాయాన్ని వేగంగా అందేలా చేయడం, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.1,21,427 సహాయం మంజూరు కావడం, దానిని స్వయంగా మంత్రి కుటుంబ సభ్యులకు అందజేయడం పట్ల వెంకట్ దీక్షిత్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో తమ సమస్యను అర్థం చేసుకుని వెంటనే స్పందించి, తిరుపతిలోని SVIMSలో చికిత్స పొందేందుకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
.


