రాయదుర్గం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేద్దాం.-చైర్మన్ అభ్యర్థి టoకశాల హనుమంతును అత్యధిక మెజారిటీతో గెలిపించండి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

.ఏపీ అక్షర విజయం న్యూస్, ,రాయదుర్గం : బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టoకశాల హనుమంతును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం పట్టణంలో ఆదివారం టoకశాల హనుమంతు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయదుర్గం నియోజకవర్గానికి నిధులు కేటాయించి అభివృద్ధిని పరిచయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధికి బలమైన పునాది వేసింది తెలుగుదేశం పార్టీయేనని, నేడు కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో పట్టణ సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారం, మంత్రి నారా లోకేశ్ వేగవంతమైన నిర్ణయాలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.253 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని, పెన్షన్లను పెంచి పేదలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని కాలవ అన్నారు. కూటమి పాలన మరో 15 సంవత్సరాలు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. రాయదుర్గం ప్రజలు కులమతాలు, వర్గాలకు అతీతంగా కూటమి పార్టీలను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో రాయదుర్గం పట్టణ ప్రజలు తనకు 16 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించారని గుర్తుచేశారు. అప్పటి నుంచి పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి పనులకు ప్రజల మద్దతు మరింత బలాన్ని ఇస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ అందించాలని కోరారు. గతంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజల మద్దతు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఏ ఒక్క వార్డులోనూ గెలుపు అవకాశాలు లేవని పేర్కొన్నారు. వైయస్సార్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే కూటమి అభ్యర్థులనే ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం మున్సిపాలిటీలోని మొత్తం 40 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడంతో పాటు, చైర్మన్ అభ్యర్థి టoకశాల హనుమంతును అత్యధిక మెజారిటీతో గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News