శ్రీ సత్యసాయి,పుట్టపర్తి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
ప్రశాంత, పారదర్శక వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు
స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు పి. అరుణ్ బాబు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణఎన్నికలు–2026ను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు పి. అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అనంతపురం జిల్లా అటవీ శాఖాధికారి డి. రవీంద్రనాథ్ రెడ్డి (ఐఎఫ్ఎస్) తదితరులు పాల్గొని ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టిఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పరిశీలకులు సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలిజిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన భద్రత కల్పించాలన్నారు.ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఏర్పాట్లు పూర్తి చేయాలిఎన్నికల విధులకు నియమితులైన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, రవాణా, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.శాఖల మధ్య సమన్వయంతో ఎన్నికలు విజయవంతం చేయాలిజిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ప్రతి దశలో నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు ఎస్ పి అంకిత సురన,డిఆర్ఓ కొండయ్య, జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య,డిపిఓ వెంకట రత్నం,డిడబ్ల్యుఎంఏ పిడి విజయ్ ప్రసాద్,వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



