శ్రీ సత్యసాయి జిల్లా , పుట్టపర్తి :
అనుమతులు లేని సభలు సమావేశాలు నిర్వహించరాదు..
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు –
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు:
శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్, జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, తెలిపారు. ఈ ఆంక్షలను రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. అమలులో ఉన్న ఆంక్షలకు విరుద్ధంగా నలుగురికి మించి గుమిగూడరాదని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, వివాదాలకు దారితీసే ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు సంయమనం పాటిస్తూ, ఎలాంటి వివాదాలకు లేదా ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ప్రజలకు శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని తెలిపారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


