ప్రభుత్వానికి, ఎన్నికల అధికారులకు డీటీఎఫ్ విజ్ఞప్తి
పుట్టపర్తి (ఏపీ అక్షర విజయం) అక్టోబర్ 29:
నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టుబడి గౌస్ లాజమ్ ప్రభుత్వాన్ని, ఎన్నికల అధికారులను కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ సామగ్రి స్వీకరణ, పోలింగ్ నిర్వహణ, అనంతరం సామగ్రి అప్పగింత వంటి బాధ్యతలను ఉద్యోగులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం విధుల్లో ఉండటంతోపాటు, దూర ప్రాంతాల నుంచి వచ్చే సిబ్బంది ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు, ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి విశ్రాంతి లభించడంతోపాటు ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.


