జగనన్న అభివృద్దే మా విజయానికి నాంది
శ్రీ సత్యసాయి జిల్లా , సోమందేపల్లి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మా నాయకుడు జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని వైసిపి జడ్పిటిసి అభ్యర్థి రామక్క కుమారుడు నాగభూషణ్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి గోవిందమ్మ గారి శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల పరిధిలోని నల్లగొండ్రాయునిపల్లి గ్రామంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో నాయకులు, కార్యకర్తలకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు తిరుగుతూ వైసిపి అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన విశేష కృషిని వారు ఓటర్లకు వివరించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా హామీలు నెరవేర్చక టిడిపి ప్రభుత్వం ప్రజలకు మోసం చేసిందని వైసిపి నాయకులు నాగభూషణ్ రెడ్డి, ఎంపిటిసి అభ్యర్థి గోవిందమ్మ గారి శ్రీనివాసులు పేర్కొన్నారు. వెళ్లిన ప్రతిచోట ప్రజలు తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని, ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించి ఎంపిపి, జడ్పీటీసీలను కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నరసింహమూర్తి, వేణు, రవీంద్ర, బాబావలి, పృథ్వి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.



