కడప జిల్లా పెండ్లిమర్రి మండలం
•కార్యాలయం బయట కనిపించని బోర్డు.. మూలన పడేయడంపై ప్రజల అభ్యంతరం
పెండ్లిమర్రి: ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించి, ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు అమలులో ఉన్న సమాచార హక్కు చట్టం (RTI)పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే పెండ్లిమర్రి మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.పెండ్లిమర్రి ఎంపీడీవో కార్యాలయం బయటకు వచ్చిన ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. కార్యాలయం లోపల ఒక మూలన బోర్డు పడేసినట్లు స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలంటే బోర్డును అందరికీ కనిపించే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండటం ముఖ్యం. సమాచారాన్ని పొందేందుకు ఎవరిని సంప్రదించాలి? దరఖాస్తు ఎలా చేయాలి? వంటి వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.గతంలో కడప జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సమాచార హక్కు కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి పెండ్లిమర్రి ఎంపీడీవో కార్యాలయం బయట ప్రజలకు స్పష్టంగా కనిపించేలా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించడంలో అధికారులు చొరవ చూపుతారా? లేక బోర్డు కార్యాలయం మూలకే పరిమితం అవుతుందా? అనేది వేచి చూడాలి.


