హిందూపురం వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు..సెక్టార్ ఇన్చార్జిలకు దిశానిర్దేశం : జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం :
పట్టణంలో ఆదివారం (నేడు )జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.
నిమజ్జన బందోబస్తుకు కేటాయించిన పోలీసు అధికారులు, సెక్టర్ ఇన్చార్జి లకు శనివారం సాయంత్రం హిందూపురంలోని ఏఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం ఎస్పీ ద్విచక్ర వాహనంపై హిందూపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా వినాయక మండపాలను క్షేత్రస్థాయిలో ఎస్పీ స్వయంగా పర్యటించి పరిశీలించారు. శోభాయాత్ర మార్గాలు, రద్దీ ప్రాంతాలు, వినాయక మండపాలు, నిమజ్జన పాయింట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు, అవసరమైన చోట్ల బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచించారు.
పలు మండపాల వద్ద నిర్వాహకులతో మాట్లాడి పోలీసు శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. శోభాయాత్ర సందర్భంగా రద్దీని క్రమబద్ధీకరించి ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధిక శబ్దం, డీజేలు, రెచ్చగొట్టే నినాదాలకు తావులేకుండా చూడాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక నిమజ్జన బందోబస్తు కోసం డీఎస్పీలు,సీఐలు, ఎస్‌ఐలు సహా మొత్తం 1,000 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి, క్రమశిక్షణతో ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్, డీఎస్పీ శివ నారాయణ స్వామి, సీఐలు అబ్దుల్ కరీం, ఆంజనేయులు, జనార్దన్, ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News