కూటమి ప్రభుత్వ హామీలపై జెడ్పీటీసీ అభ్యర్థి మద్దే రాజు నాయుడు విమర్శలు
శ్రీ సత్యసాయి జిల్లా, ఓబులదేవరచెరువు:

ఓబులదేవరచెరువు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. దిగువపల్లి, కొండకమర్ల, ఓబులదేవరచెరువు, మిట్టపల్లి గ్రామ పంచాయతీల్లో జెడ్పీటీసీ అభ్యర్థి మద్దే రాజు నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై తమ అభిప్రాయాలను వివరించారు.ఈ సందర్భంగా మద్దే రాజు నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా ప్రజలను వేధిస్తున్నాయని ఆరోపించారు. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ఉపాధి అవకాశాలు లేక యువత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు అందిస్తామన్న హామీలు కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.రైతులు, నిరుద్యోగులు, మహిళలు, బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రాజు నాయుడు ఆరోపించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తోందని, అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీపతి రెడ్డి, వివిధ పంచాయతీల ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




