20 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యం: ట్రస్ట్ వ్యవస్థాపకుడు మన్సూర్
శ్రీ సత్యసాయి జిల్లా
తలుపుల: పండుగ వేళ నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపేందుకు ఫ్రెండ్స్ ట్రస్ట్ ముందడుగు వేసింది. దీపావళి పండుగను పురస్కరించుకుని తలుపుల మండలంలోని దిగువ నూతన కాలవ గ్రామానికి చెందిన సుమారు 20 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది.
గ్రామంలోని ఆయా కుటుంబాలు రోజువారీ కూలి పనులు, వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఫ్రెండ్స్ ట్రస్ట్ సభ్యులు నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి పండుగ కానుకగా నిత్యావసర సరుకులను అందజేశారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మన్సూర్ మాట్లాడుతూ.. దీపావళి అంటే కేవలం ఇళ్లలో దీపాలు వెలిగించడం మాత్రమే కాదని, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన పండుగ స్ఫూర్తి అని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పేద కుటుంబాలు సైతం ఆనందంగా దీపావళి జరుపుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
భవిష్యత్తులోనూ నిరుపేద కుటుంబాల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఫ్రెండ్స్ ట్రస్ట్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. పండుగ వేళ పేద కుటుంబాలకు అండగా నిలిచిన ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు.



