కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలి..
నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి
పుట్టపర్తి, నవంబరు 15 (ఏపీ అక్షర విజయం):
కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1న ఢిల్లీలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్మికుల మహా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులు, ఉద్యోగులు, స్కీం వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో ఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులందరికీ నెలకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ, ఉపాధి భద్రత కల్పించాలని అన్నారు.స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వత ఉద్యోగులుగా కొనసాగించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని పేర్కొన్నారు.కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న మహా ముట్టడిలో కార్మికులు, ఉద్యోగులు, స్కీం వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జెడ్.పి. శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు, జిల్లా కోశాధికారి ఎన్. లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పైపల్లి గంగాధర్, బాబ్జాన్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


