

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి
ఏపీ అక్షర విజయం న్యూస్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, శాంతిభద్రతలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి పలు పట్టణాలు, గ్రామాల్లో గ్రామసభలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించారు.ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ చట్టాలను, ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంయమనం పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. గొడవలు, ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.


