రాజంపేట,
చిరస్మరణీయ అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 104వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రస్థాయి తెలుగు సినిమా పాటలు, లలిత సంగీతం, చిరస్మరణీయ వాగ్గేయకారుల శాస్త్రీయ సంగీతం, సంగీత వాయిద్య పోటీలను నిర్వహించనున్నట్లు కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్. కళాంజలి, కార్యదర్శి ఎస్. విజయ కళ్యాణ్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు పాత్రికేయులతో మాట్లాడుతూ, పోటీల్లో పాల్గొనదలచిన ఔత్సాహిక గాయనీ గాయకులు, వాయిద్య కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ముందుకు రావాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు తాము పాల్గొనదలచిన అంశాన్ని పేర్కొంటూ తమ పేరు, చిరునామాతో నవంబర్ 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
సంగీత వాయిద్య పోటీల్లో పాల్గొనే కళాకారులకు 34 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని తెలిపారు. వీణ, సితార్, వయోలిన్, వేణువు, నాదస్వరం, తబలా, ఘటం, మృదంగం తదితర వాయిద్యాల్లో తమ ప్రతిభను ప్రదర్శించవచ్చని వెల్లడించారు.
పోటీల రోజున పాల్గొనే కళాకారులకు ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో ఐదుగురు విజేతలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి పర్మినెంట్ షీల్డ్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 9490884300, 9490443000 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.


