ప్రత్యేక ఆకర్షణగా బీజేపీ నేత, సినీ నటుడు సాయికుమార్
సినీ డైలాగులు, ప్రసంగంతో ఆకట్టుకున్న సాయికుమార్

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో 47, 48, 49, 53 డివిజన్లలో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం
62 డివిజన్లలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని దగ్గుపాటి ప్రసాద్ పిలుపు
అనంతపురం: నగరంలో కూటమి నేతల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నగరంలోని పలు డివిజన్లలో కూటమి నాయకులు రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత సాయికుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ బాబు పాల్గొన్నారు. 47వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నాగేంద్ర (కొవ్వూరు నగర్), 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థి సంగీత (లక్ష్మీనగర్), 49వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బషీరున్ (ఆజాద్ నగర్), 53వ డివిజన్ జనసేన అభ్యర్థి తేజ రాయల్ (6వ రోడ్డు) తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్లలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కలుసుకుని ప్రచారం చేశారు.
సినీ డైలాగులతో సాయికుమార్ సందడి

ప్రచారంలో భాగంగా సాయికుమార్ తనదైన శైలిలో సినీ డైలాగులు, ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. “నాది, మాది అంటే పరాయితనం.. మాది, నాది అంటే కిరాయితనం.. మనది, మనందరిదీ అంటే మనతనం, మంచితనం, మగతనం!” అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌కు ప్రజల నుంచి చప్పట్లు లభించాయి.
కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ బాబు పేరులోనే కర్తవ్యం ఉందని, ఆయనను గెలిపించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సాయికుమార్ పేర్కొన్నారు. 1983 నుంచి తాను దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు పెరుగుతోందని అన్నారు. దేశ అభివృద్ధి కోసం పనిచేసే నాయకత్వానికి ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు.
తన జీవితానికి, ‘పోలీస్ స్టోరీ’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ ఆప్యాయత ఎల్లప్పుడూ తనకు ఉంటుందని చెప్పారు. తాను సత్యసాయి బాబా భక్తుడినని, ఉమ్మడి జిల్లాలో సత్యసాయి తాగునీటి పథకం పేరును అప్పట్లో ప్రకటించింది తానేనని గుర్తుచేసుకున్నారు.
“కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కనిపించే మూడు సింహాలైతే.. కనిపించని నాలుగో సింహం ప్రజలే” అంటూ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకున్నాయి. దేశం మనకు ఏమి చేసిందన్నదానికంటే, దేశానికి మనం ఏమి చేశామన్నదే ముఖ్యమని అన్నారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వానికి నగరంలోనూ మద్దతు లభిస్తే అనంతపురం అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఉంటాయని సాయికుమార్ పేర్కొన్నారు. నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు విమానాశ్రయ సదుపాయం తీసుకురావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అజేష్ బాబు, దగ్గుపాటి ప్రసాద్‌లను తాను స్వయంగా అడుగుతానని చెప్పారు.
నగర అభివృద్ధికి కూటమికి మద్దతివ్వాలి: దగ్గుపాటి ప్రసాద్
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగరం అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పనులను దశలవారీగా పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
నగరంలో రోడ్ల విస్తరణ, తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతపురం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే నగరపాలక సంస్థలోనూ కూటమికి ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు.
బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ బాబు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆయనకు మద్దతు లభిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
నగరంలోని 62 డివిజన్లలో కూటమి అభ్యర్థుల తరఫున నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని, నగర అభివృద్ధికి సంబంధించిన తమ ప్రణాళికలను ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.



