శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి:-
పర్యాటక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
బొటానికల్ గార్డెన్ శిలాఫలకం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్
విశేషంగా ఆకట్టుకున్న ‘ఎకో అండ్ హెరిటేజ్ వాక్’, సాంస్కృతిక ప్రదర్శన
తరతరాల మన వారసత్వ, పర్యాటక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కదిరి నియోజకవర్గం గూటిబైలు గ్రామం వద్దగల ప్రపంచ ప్రఖ్యాత ‘తిమ్మమ్మ మర్రిమాను’ (గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్) ప్రాంగణంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, పర్యాటక శాఖ అధికారి నరసయ్య, అటవీ శాఖ అధికారి చక్రపాణి తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా తిమ్మమ్మ మర్రిమాను ప్రధాన ద్వారం వద్ద సందర్శకుల సౌకర్యార్థం ‘ఆస్క్ ఏఐ’ (Ask AI) యాప్‌ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం రంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. తిమ్మమ్మ మర్రి నుండి ఈశ్వరమలై వరకు నిర్వహించిన ‘ఎకో అండ్ హెరిటేజ్ వాక్’ లో కీలుగుర్రాలు, గురవయ్యల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధికారులు, విద్యార్థులు, పర్యాటకులు ఉత్సాహంగా ఈ వారసత్వ నడకలో పాల్గొన్నారు.
బొటానికల్ గార్డెన్‌కు శంకుస్థాపన:
ఈశ్వరమలై వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న బొటానికల్ గార్డెన్ శిలాఫలాకాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆవిష్కరించారు. సీమ ప్రాంతానికి చెందిన అరుదైన ఔషధ, వృక్ష జాతులను ఇక్కడ పెంచి పర్యాటకులకు, విద్యార్థులకు పర్యావరణ విజ్ఞానాన్ని అందించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ… “పుట్టపర్తి ప్రశాంతి నిలయం, తిమ్మమ్మ మర్రిమాను వంటి ప్రదేశాలు ప్రపంచ పర్యాటక పటంలో శ్రీ సత్యసాయి జిల్లాకు గర్వకారణంగా నిలిచాయి. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం.”
జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ… విద్యార్థులు చారిత్రక సంపదపై అవగాహన పెంచుకోవాలని జేసీ కోరగా, తిమ్మమ్మ మర్రిమానుతో పాటు వేమన సమాధిని కూడా మరింత అభివృద్ధి చేస్తామని పర్యాటక, అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ… “తిమ్మమ్మ త్యాగానికి ప్రతిరూపమైన ఈ మర్రిమాను ఆరు వందల ఏళ్లుగా మనకు నీడనిస్తోంది. ఈ ప్రకృతి సంపదను, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని భావి తరాలకు అందించాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలి.”
ప్రత్యేక ఆకర్షణలు:
ధర్మవరానికి చెందిన బాబు బాలాజీ, మానస బృందం ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ‘తిమ్మమాంబ సెల్ఫీ పాయింట్’ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పర్యాటక శాఖ రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ ను అతిథులు ఆవిష్కరించారు. పర్యాటక, చారిత్రక రంగానికి సేవలుందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించడంతో పాటు, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కళావతి, పర్యాటక శాఖ అధికారి ప్రతాప్, తహశీల్దార్ లక్ష్మమ్మ, తిమ్మమాంబ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటనారాయణ, ఎంపీడీఓ పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గూటిబైలు గ్రామస్తులు విశేషంగా పాల్గొన్నారు.




