వెద జల్లుతున్న దుర్వసన…. మురుగు కాలువా… చెత్తకుప్పా..? అధికారుల నిర్లక్ష్యంతో కంపుకొడుతున్న పరిసరాలు

అనంతపురం జిల్లా ,పామిడి,

పామిడి, ఏపీ అక్షర విజయం : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పారిశుద్ధ్య వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పామిడి మండల పరిధిలోని రామగిరి గ్రామం లో రహదారి పక్కనే ఉన్న మురుగు కాలువ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్యాకెట్లు, ఇతర వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయి అధ్వానంగా మారింది. కాలువలో నల్లటి మురుగునీరు నిలిచిపోవడంతో పరిసర ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. కాలువలో నీటి ప్రవాహం సక్రమంగా లేకపోవడంతో మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలకు ఆవాసంగా మారుతోంది.
కాలువకు ఇరువైపులా చెత్త పేరుకుపోవడంతో పాటు పిచ్చిమొక్కలు, ఎండిపోయిన వ్యర్థాలు విపరీతంగా పెరిగాయి. ప్రజలు వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు, ఆహార పదార్థాల ప్యాకెట్లు తదితరాలను కాలువలోనే పడేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో మురుగు కాలువ నీరు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. చిన్నపాటి వర్షం పడినా కాలువలోని మురుగు నీరు పొంగి రహదారిపైకి వచ్చే ప్రమాద కరంగా మారింది

దోమలకు నిలయంగా.. వ్యాధులకు కారణంగా*

మురుగు నీరు రోజుల తరబడి నిలిచిపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో పరిసరాల్లో నివసించే ప్రజలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులపై దుయ్యాపట్టారు .

కాలువ ఉన్నా.. శుభ్రత మాత్రం కరువు

మురుగు నీరు వెళ్లేందుకు కాలువ ఏర్పాటు చేసినప్పటికీ దాని నిర్వహణ పై సంబంధిత సిబ్బంది దృష్టి సారించకపోవడం సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాలువలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో మురుగు ప్రవాహం అడ్డుకుపోయింది. మరోవైపు ప్రజలు కూడా చెత్తను కాలువలో పడేయకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

అధికారులు స్పందించాలి

ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే కాలువలోని చెత్తను తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలువను శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్, దోమల నివారణ మందుల పిచికారీ చేపట్టాలని, భవిష్యత్తులో చెత్త పేరుకుపోకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పుగా మారకముందే అధికారులు స్పందించి మురుగు కాలువను శుభ్రం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News