శ్రీ సత్యసాయి జిల్లా..పెనుకొండ,రొద్దం :
వినాయక వేడుకలు.. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా సాగాలి..
జిల్లా ఎస్పీ..
పెనుకొండ, కియా పీఎస్, రొద్దం మండలాల్లో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్
రొద్దంలో పూర్ణకుంభంతో ఎస్పీ కి ఘన స్వాగతం పలికిన వేద పండితులు, నిర్వాహకులు…
వినాయక చవితి వేడుకలు, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పెనుకొండ, కియా పోలీస్ స్టేషన్, రొద్దం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పెనుకొండ, కియా పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ గారు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం పెనుకొండలోని బోయపేట, జీఐఎస్ కాలనీ, ఆల్విన్ కాలనీ, అలాగే కియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టూరు, మునిమడుగు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు .
అనంతరం భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు ప్రజలకు సూచించారు.
అనంతరం రొద్దం మండలంలో పర్యటించిన ఎస్పీ వినాయక మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేడుకలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలు, నిర్వాహకులు పరస్పర సమన్వయం, సోదరభావంతో వినాయక వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని, మద్యం సేవించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని మండపాల నిర్వాహకులకు తెలియజేశారు
అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, లైటింగ్, పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పటిష్టమైన ప్రణాళికతో విధులు నిర్వహించాలని, వేడుకల ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసు శాఖ సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు.
ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు పోలీసు శాఖకు ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పర్యటనలో పెనుకొండ సీఐ రాఘవన్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజా, కుల్లాయప్ప తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



