ప్రాజెక్ట్ పునర్జీవనంతో కరువు నేలలకు కొత్త జీవం : జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్

అమరావతి/పుట్టపర్తి,

ప్రాజెక్ట్ పునర్జీవనంతో కరువు నేలలకు కొత్త జీవం :జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్

5,000 ఎకరాల్లో నేల పునరుజ్జీవనం.. 4,000 టన్నుల కార్బన్ ఉద్గారాల నివారణ లక్ష్యం

మల్బరీ వ్యర్థాలతో బయోచార్ తయారీకి వినూత్న ప్రణాళిక

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ‘ప్రాజెక్ట్ పునర్జీవనం (Project Punarjeevanam)’ పై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సమగ్ర వివరాలను అందించారు.

శ్రీ సత్యసాయి జిల్లా తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి ఎద్దడి, నేలలో తేమ తగ్గుదల, వ్యవసాయ వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేయడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రాజెక్ట్ పునర్జీవనాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.

ఇటీవల జిల్లాలో 20,000 సాయిల్ హెల్త్ శాంపిల్స్ పరిశీలించగా, నేలలో సేంద్రీయ కార్బన్ శాతం కేవలం 0.38 శాతంగా నమోదైందని, సాధారణంగా ఇది 1 శాతానికి పైగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. నత్రజని స్థాయులు తక్కువగా ఉండటంతో పాటు సూక్ష్మపోషకాల లోపం కూడా ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.

5,000 ఎకరాల్లో నేల పునరుజ్జీవనం

ఐదేళ్ల ప్రాజెక్టులో భాగంగా 5,000 ఎకరాల్లో సాయిల్ రీజనరేషన్ సాధించడం, సుమారు 4,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమాన ఉద్గారాలను (CO₂e) నివారించడం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యాలని కలెక్టర్ తెలిపారు.

ప్రాజెక్టు తొలి ఏడాదిలో 1,000 టన్నుల బయోచార్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

మల్బరీ వ్యర్థాలతో బయోచార్

జిల్లాలోని సెరీకల్చర్ ప్రాంతాల్లో పట్టుపురుగుల మేత అనంతరం మిగిలే మల్బరీ కాండాలను FPOలు, స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. సేకరించిన కాండాలను బహిరంగంగా ఎండబెట్టి సుమారు 15 శాతం తేమ స్థాయికి తీసుకువచ్చిన అనంతరం ప్రత్యేక కిల్న్లలో నియంత్రిత, పరిమిత ఆక్సిజన్ వాతావరణంలో బయోచార్‌గా మారుస్తారు.

తయారైన పోరస్ బయోచార్‌కు అవసరమైన బయో-ఇన్‌పుట్స్‌ను జోడించి సంవర్ధనం చేస్తామని, తద్వారా నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. శుద్ధి చేసిన బయోచార్‌ను నామమాత్రపు ధరకే రైతులకు అందించనున్నట్లు తెలిపారు.

అనేక శాఖల సమన్వయంతో అమలు

ప్రాజెక్ట్ అమలులో వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, DRDAతో పాటు స్థానిక యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సాంకేతిక, నాలెడ్జ్ ఎక్స్‌పర్టైజ్ కోసం IIT గువాహటి ఆధారిత 2.D.O సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.

అలాగే UKకి చెందిన రేయిన్‌బోహన్ సంస్థతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, ‘ప్లాన్ భూ’ వేదిక ద్వారా ప్రాజెక్టుకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ నిర్వహించి 800 కార్బన్ క్రెడిట్స్ సాధించే దిశగా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు.

రైతులకు, నేలకు బహుళ ప్రయోజనాలు

బయోచార్‌ను నేలలో వినియోగించడం ద్వారా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరగడంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ వివరించారు. బయోచార్ నేలలో దీర్ఘకాలం నిలిచి కార్బన్‌ను స్థిరీకరించగలదని తెలిపారు.

సెరీకల్చర్‌లో మల్బరీ ఆకుల నాణ్యత, కకూన్ బలం పెరగడంతో 20–25 శాతం వరకు దిగుబడి పెరిగినట్లు కేస్ స్టడీస్‌లో వెల్లడైనట్లు తెలిపారు. మిల్లెట్ వంటి పంటల్లోనూ మొక్కల పెరుగుదల, టిల్లర్ల సంఖ్య వంటి అంశాల్లో గణనీయమైన మెరుగుదల నమోదైనట్లు శాస్త్రీయ పరిశీలనల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు.

కరువు ప్రాంతంలో వ్యవసాయ వ్యర్థాలను వనరులుగా మార్చి.. నేలకు జీవం పోసి.. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ‘ప్రాజెక్ట్ పునర్జీవనం’ ఒక వినూత్న కార్యక్రమంగా నిలుస్తుందని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News