*శ్రీ సత్యసాయి జిల్లా కదిరి : పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా నిజాం వలి కాలనీలోని 18, 19వ వార్డుల్లో కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ , కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను తో పాటు పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కి కాలనీ ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో నిజాం వలి కాలనీకి చెందిన కౌన్సిలర్‌కు చైర్మన్ పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కదిరి పట్టణ అభివృద్ధితో పాటు నిజాం వలి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ముఖ్యంగా కాలనీలోని బీడీ కార్మికుల సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని, వారి సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కదిరి పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా భానుతో పాటు నిజాం వలి కాలనీ పరిధిలోని ఐదు వార్డుల కూటమి కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు.మొత్తంగా కదిరి పట్టణంలోని 44 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి నాయకులు తెలిపారు.


