కాంట్రాక్టర్ల పాలిట కామధేనువు’గా శానిటేషన్ ఇన్స్పెక్టర్ ?

శ్రీ సత్య సయి జిల్లా , ధర్మవరం పట్టణం.

• దొంగ బిల్లుల దందాపై సమగ్ర విచారణ జరపాలి నెలనెలా లక్షల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం…

• సమాచారం అడిగితే ముఖం చాటేస్తున్న వైనం.

ధర్మవరం మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. పట్టణం చెత్తాచెదారంతో కంపుకొడుతుంటే, శానిటేషన్ విభాగం మాత్రం అవినీతి వాసనలతో కుళ్ళిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం సదరు విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ శాంసన్ వ్యవహారశైలేనని మున్సిపల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విధులను గాలికొదిలేసి, కాంట్రాక్టర్ల కమిషన్ల వేటలో ఈయన బిజీగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగకపోయినా, వీధులు శుభ్రం చేయకపోయినా.. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చకచకా పాస్ అయిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పనితీరును పర్యవేక్షించాల్సిన ఇన్స్పెక్టర్ గారు, ఏసీ గదుల్లో కూర్చొని దొంగ బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెల లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ, అందులో తన ‘కమిషన్’ వాటాను భారీగా వెనకేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పని చేయని కాంట్రాక్టర్ల పాలిట ఈయన గారు ‘కామధేనువు’గా మారారని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన శాంసన్, తరచూ విధులకు డుమ్మా కొట్టడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో ఈయన సీట్లో కంటే.. బయట ప్రైవేట్ లొకేషన్లలోనే ఎక్కువ దర్శనమిస్తారనే టాక్ నడుస్తోంది. జీతం ప్రభుత్వం ఇస్తుంటే, సేవలు మాత్రం కాంట్రాక్టర్లకు అందిస్తున్నారంటూ పౌరులు మండిపడుతున్నారు.పట్టణంలో పారిశుధ్య లోపాలపై లేదా బిల్లుల వ్యవహారాలపై ఎవరైనా సమాచారం అడిగేందుకు ప్రయత్నిస్తే ఈయన గారు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. అడిగేందుకు వచ్చే వారిని తప్పించుకు తిరగడం, ఫోన్లు ఎత్తకపోవడం ఈయనకు పరిపాటిగా మారింది. సమాచార హక్కు చట్టాన్ని గానీ, ప్రజల జవాబుదారీతనాన్ని గానీ ఈయన అస్సలు ఖాతరు చేయడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తప్పులు చేశారు కాబట్టే సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ధర్మవరం శానిటేషన్ విభాగంలో జరుగుతున్న ఈ దొంగ బిల్లుల దందాపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. విధులకు గైర్హాజరవుతూ, అవినీతికి పాల్పడుతున్న సదరు ఇన్స్పెక్టర్ శాంసన్‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News