పారదర్శకంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణే లక్ష్యం :జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

పుట్టపర్తి రెవెన్యూ భవన్‌లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ తరగతులు ప్రారంభం

పుట్టపర్తి, నవంబర్ 09: రెండవ విడత గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు–2026ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం ఎన్నికల మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఎన్నికల విధివిధానాలు, జాగ్రత్తలు, సాంకేతిక అంశాలపై శిక్షకులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు డివిజన్ల వారీగా తమ పరిధిలోని మండలాల్లో స్టేజ్‌–1, స్టేజ్‌–2 రిటర్నింగ్ అధికారులు (ROs), ప్రిసైడింగ్ అధికారులు (POs), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APOs), రూట్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత విధానం, సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకటరత్నం, డీడబ్ల్యూఎంఏ పీడీ విజయప్రసాద్‌తో పాటు మండలాల వారీగా ఎంపికైన టీఓటీలు, ఆర్డీఓలు, డీడీఓలు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News