అనంతపురం, పామిడి:-
పామిడి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల పనులను నిబంధనల ప్రకారం చేయవలసిన అధికారులు అదును చూసి కోరలు చాచిన అవినీతి భూతంలా ప్రజలపై విరుచుకుపడి ఇష్టం వచ్చినట్టుగా లంచాలు దండుకుంటూ, స్వలాభం పొంది, తమ జేబులు నింపుకుంటున్నారు అనడానికి పామిడి గ్రామ పంచాయతీలో ఇంటి గుత్త మార్పు విషయంలో జరిగిన అవినీతి బాగోతం నిదర్శనంగా నిలుస్తోంది. పామిడి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ ఇంటి గుత్తాలో పేరు మార్చేందుకు గ్రామస్తుడు సంబంధిత అధికారులను సంప్రదించగా 40 వేల రూపాయలు డిమాండ్ చేశారని వ్యక్తి ఆరోపిస్తున్నాడు, అధికారులు అడిగినటువంటి మొత్తం డబ్బును చెల్లించినప్పటికీ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన పని జరగడంలేదని, మీరు చెల్లించిన డబ్బు అప్పటి ఈవో గారికి చెల్లించడం జరిగిందని, అది మాకు సంబంధం లేదంటూ మీకు పని జరగాలి అంటే మళ్ళీ తిరిగి డబ్బు చెల్లించాలంటూ అధికారులు బాధితుని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలతో పామిడి పంచాయతీలో జరుగుతున్న చీకటి అవినీతి బాగోతం బయటపడిందని చెప్పవచ్చు. పామిడి మేజర్ గ్రామపంచాయతీలో పని చేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలోని అవినీతి బాగోతం విచ్చలవిడిగా చెలరేగుతోందని చెప్పడానికి బాధితుడి దగ్గర ఉన్నటువంటి పత్రాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తన విధి నిర్వహణ బాధ్యతలను కార్యాలయంలోనే ఆచరించవలసినటువంటి జూనియర్ సహాయకులు గ్రామంలోని అవినీతి బాగోతంలో ప్రధాన పాత్ర పోషించడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కార్యాలయంలోని కిందిస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ అదుపు చేయవలసిన ఉన్నతాధికారులు కూడా బహిర్గతమవుతున్నటువంటి అవినీతి ఆరోపణలపై చీమకుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరించడం తన అవినీతి బాగోతంలో అధికారులకు కూడా వాటా ఉందన్న అనుమానాలను బలపరుస్తోంది. ఇటీవల కాలంలో జిల్లా స్థాయి అధికారులు కార్యాలయంనీ సందర్శించి తనిఖీలు చేసినప్పటికీ, అవినీతి అధికారుల బాగోతాలు గతంలో పలు పత్రిక కథనాలలో ప్రచురించినప్పటికీ వీరిపై చర్యలు మాత్రం శూన్యము. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేసి అవినీతి చేసినటువంటి అధికారులపై తగిన చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.



