వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

అధికారులతో సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు

అనంతపురం, కదిరి,
కదిరి పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు.
కదిరి పట్టణంలోని దేవరచెరువు వద్ద నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్న ప్రదేశాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి జాప్యం, లోటుపాట్లు లేకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అదేవిధంగా వినాయక మండపాల నిర్వాహకులు కూడా అధికారులకు పూర్తి సహకారం అందిస్తూ, నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి , డీఎస్పీ శివనారాయణ స్వామి , ఆర్డీవో ఆవుల కళావతి , మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ , విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News